Skip to main content

మా సొంతూరు అంటే రెండూళ్ల గురించి చెప్పాలి


మా సొంతూరు అంటే రెండూళ్ల గురించి చెప్పాలి. మొదటిది కరీంనగర్ జిల్లా మానుకొండూరు మండలం ఊటూరు అనే గ్రామం. మా తాతముత్తాతలదా ఊరే. మా నాన్న (జనార్దనరెడ్డి) వాళ్లు ఎనిమిది మంది అన్నదమ్ములు అక్కచెల్లెళ్లు. అంతమందిలో పంచుకున్నప్పుడు తగినంత భూవసతి ఏర్పడలేదాయనకు. అందువల్ల గంగ (గోదావరి) దాటి వచ్చి ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో ఫారెస్టు కంట్రాక్టర్ల దగ్గర గుమస్తాగా చేరారు.ముగ్గురు అక్కయ్యలు, నేను, ఒక తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్లు వెరసి ఏడుగురు పిల్లలం మేం. మా పెదనాన్న, మేనత్త - ఊటూరులోనే స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. అందువల్ల నాకు పదేళ్ల వయసు వచ్చేవరకూ ప్రతి పండగకూ సెలవులకూ ఊటూరెళ్లిపోయేవాళ్లం. అది సంప్రదాయకమైన పల్లెటూరు. కుల వ్యవస్థ, మతాచారాలు, ఆర్థిక తారతమ్యాలు అన్నీ బలంగా ఉండేవి అక్కడ. స్పష్టంగా బైటికి తెలిసేవి కూడా. ఊటూరు - జోగాపురం మధ్యన సుమారు వంద కిలోమీటర్ల దూరం ఉంటుందేమో. తేడాలు మాత్రం చాలా ఎక్కువ. అంత చిన్న వయసులోనూ మాకు స్పష్టంగా తెలిసేవి. మా ఊరితో పోల్చినప్పుడు ఊటూరు మనుషుల్లో వ్యవసాయంలో, వ్యవహారంలో ఆధునికత కనిపించేది. అక్కడ వైష్ణవం ఎక్కువ. గురువులు వచ్చి సందేశాలిచ్చేవారు. వాళ్లు మడిగా వంటచేసుకుంటుంటే మాకు వింతగా అనిపించేది. పూజలు చేశాక మా పెదనాన్న, మేనత్త మమ్మల్ని ఆ గురువుల కాళ్లకు మొక్కమనేవారు. మాకు ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే మా ఊళ్లో మాకు గురువులు లేరు, కులమత భేదాల్లేవు. ఇక్కడవన్నీ ఎందుకున్నాయో మాకు అర్థమయేది కాదు. వైష్ణవాన్ని స్వీకరించిన మా మేనత్త శివాలయానికి వచ్చేదికాదు. అక్కడి ప్రసాదం ఇస్తే తినేది కాదు. 'ఎవరైనా దేవుడే కదా. దేవుడికి మొక్కమని చెప్పింది నువ్వే కదా' అని మేం అడిగితే ఏదో చెప్పి తప్పించుకునేది. ఊటూరు మానేరు ఒడ్డున ఉంటుంది. వర్షాకాలంలో దాన్ని దాటడం కష్టంగా ఉండేది.

www.utoorvillage.com
__________________________________________________

Comments

Popular posts from this blog

పరామర్శ

సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బోనాలు

కొనసాగుతున్న పది పరీక్షలు